Friday, 20 September 2013

విద్యాలయాల్లో విద్యార్థుల ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ


భారత నికర ఆదాయంలో 6 శాతం ప్రజల విద్యకు కేటాయించవలసిన అవసరాన్ని కేవలం విద్యార్థి ఉద్యమాలేకాక, వివిధ విద్యా హక్కు సంఘాలు, కొఠారి కమిషన్‌ 1960ల నుంచి చెప్పుతూ వస్తున్నాయి. ఆరు దశాబ్దాల స్వాతంత్య్రానంతరం కూడా ఇప్పటికీ ఇది ఒక ఎండమావిలా ఊరిస్తూ ఉన్న నిజాన్ని మనం గమనించాలి. ముఖ్యంగా 1991 నుంచి విద్యారంగంలో ప్రభుత్వ పెట్టుబడులు క్రమేపీ తగ్గడం గమనించవచ్చు.
ఈ రోజున మన దేశంలో విద్యారంగానికి ప్రభుత్వం కేటాయిస్తున్న నిధులు ఆఫ్రికా దేశాలలో కన్నా చాలా తక్కువ. ఇంకోవైపు కార్పొరేట్‌ కంపెనీలకు రాయితీలను ఇవ్వడం మాత్రం మూడు రెట్లు పెరిగింది. దీనితో వాటి లాభాలు రెండింతలు పెరిగాయి. 2013-14 బడ్జెట్‌ లెక్కల ప్రకారం రూ. 5,73,630 కోట్లు రుణం రాయితీలను ప్రభుత్వం కంపెనీలకు ఇచ్చింది. సామాజిక కార్యక్రమాల కోసం ఖర్చు చేయవలసిన నిధుల్లో రూ. 5,20,925 కోట్ల లోటు ఉందని ప్రభుత్వం చెప్పింది. దీనిని బట్టి మన ప్రభుత్వ వైఖరి తేటతెల్లం అవుతున్నది. ధనవంతులకు పన్ను రాయితీలు ఇచ్చి, పేదవాడి కోసం, సమాజ అభివృద్ధికి మాత్రం మొండిచేయి చూపించడం.
వనరుల కేటాయింపు ఒక్కటే విద్యారంగాన్ని బాగుచేస్తుంది అనేది అవాస్తవం. విద్యారంగాన్ని కేంద్రీకరించడం, పరీక్షల పద్ధతిని సమీక్షించడం, టీచరు శిక్షణను మెరుగుపరచడం మొదలైనవి కూడా చేయవలసిన అసవరం ఉంది. అంతేకాక విద్యారంగంలో సంరక్షణలు లేకుండా సమాజంలో వేరే రంగంలో అభివృద్ధి జరిగే అవకాశం, ఆ అభివృద్ధి ప్రజలలోకి వెళ్లే అవకాశం తక్కువ ఉన్నందున ప్రభుత్వం విద్యారంగంలో ఎక్కువ పెట్టుబడులను కేటాయించవలసిన అవసరాన్ని చెప్తున్నాయి. కాని, మన దేశంలో కొంతమంది ఈ సమస్యకు విద్యారంగంలో ప్రయివేటు కంపెనీలను ప్రోత్సహించడం సమాధానంగా చెప్తున్నారు. అదేసమయంలో ఈ వాదం ఎంత హానికరమో మనం ఈ రోజున దేశంలో ఉన్న స్కూళ్ల పరిస్థితిని చూస్తే అర్థం అవుతుంది. పేదవాడికి అందని ద్రాక్షలా ప్రయివేటు విద్య, ప్రభుత్వ పాఠశాలలో నాణ్యత, సదుపాయాలు లేనివిద్యను ఒక ధనవంతుని వస్తువుని చేసేశాయి. ప్రయివేటీకరణకు దూరంగా ఉన్న రాష్ట్రాల్లో విద్య కొంతైనా పేదవానికి అందుబాటులో ఉందని పరిశోధనలు తెలుపుతున్నాయి.
పట్టణాలలో ధనిక, మధ్యతరగతి పిల్లలు చదివే స్కూళ్లలోని సదుపాయాలు పేదవారి పిల్లలు చదివే గ్రామాల్లోని స్కూళ్లలో ఉన్న సదుపాయాల మధ్య చాలా అంతరం ఉంది. అలాగే షెడ్యూల్‌ కులాలు, షెడ్యూలు తెగల పిల్లలు, బాలికల స్కూళ్లలో మౌలిక సదుపాయాల కొరత, ఉపాధ్యాయుల కొరత చాలా ఉంది. ఈ కారణాల వల్ల ఈ పిల్లలు పై తరగతులకు వెళ్లడం క్రమేపీ తగ్గిపోయింది.
ఎన్నో అంచనాలతో 2009లోనే వచ్చిన విద్యా హక్కు చట్టం ప్రభుత్వ పెట్టుబడి లోపం వల్ల నీరుకారిపోయింది. కేంద్రం విద్యారంగ బాధ్యతను రాష్ట్రాల మీద వెయ్యటం, రాష్ట్రాలకు వచ్చే ఆదాయంతో దీనిని నిర్వహించడం సాధ్యపడకపోవడం, ఈ వైఫల్యానికి ముఖ్య కారణంగా చెప్పవచ్చు. ఈ రోజున ప్రభుత్వ పాఠశాలలో భవనాల లేమి, 14 లక్షల భర్తీ చేయాల్సిన టీచర్ల స్థానాలు ఈ విధాన పరిస్థితిని వివరిస్తున్నాయి.
మధ్యాహ్న భోజన పథకం నిర్వహణ లోపం వల్ల బీహార్‌లో ఈ మధ్యన 27 మంది చిన్న పిల్లల మరణం కేంద్రం విద్యారంగంపై చూపిస్తున్న శ్రద్ధకు సాక్ష్యం.
విశ్వవిద్యాలయాల్లో పరిస్థితి కూడా ఏ మాత్రం వేరుగా లేదు. కేంద్రీయ విద్యాలయాల్లో, విశ్వవిద్యాలయాల్లో, నిట్స్‌, ఐఐఎంలు, దేశవ్యాప్తంగా ఉన్న 50 పరిశోధన సంస్థల్లో సదుపాయాల లేమి, సరైన ఆర్థిక సాయం లేకపోవడం వల్ల కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాయి.
కేవలం 3 శాతం జిడిపిని కేంద్రం విద్య కోసం కేటాయించడం, అభివృద్ధి చెందిన దేశాలతో (45-85%పై చడువులు చదువుతున్న వారు) పోలిస్తే మన దేశంలో నూటికి తొంభై మంది కళాశాలల బయట పనిచేసుకుంటూ బతకటం, మన దేశంలోని పనికిరాని పాలసీలను తెలియజేస్తున్నాయి. 2011-12 బడ్జెట్‌లో కేటాయించిన రూ. 21,912 కోట్లలో రూ.2,068 కోట్లు విద్యారంగంలో ఖర్చు చేయకపోవడం కేంద్రం ఈ విషయంలో ఎంత బాధ్యతగా వ్యవహరిస్తున్నదో చెప్తున్నాయి.
ఈ పరిస్థితి మారాలంటే, విద్య అందరికీ అందుబాటులోకి రావాలంటే కేంద్రం కనీసం 6 శాతం జిడిపిని విద్యకు కేటాయించడం తప్పనిసరి అని మనమందరం గట్టిగా కోరవలసిన అవసరం ఉంది.
విద్యను ప్రయివేటు పరం చేయడాన్ని వ్యతిరేకించండి :
పన్నెండవ పంచ వర్ష ప్రణాళికలో విద్యను ప్రయివేటుపరం చేయడం, విద్యను 'లాభాపేక్ష'గల భాగంలో చూపించారు. పదకొండవ పంచవర్ష ప్రణాళిక ప్రయివేటు స్కూళ్లకు ఇచ్చిన వెసులుబాటు వల్ల ప్రభుత్వ పాఠశాలలతో పోలిస్తే రెండింతల విద్యార్థులు ప్రయివేటు స్కూళ్లలో చేరినట్లు గణాంకాలు చెప్తున్నాయి.
ప్రయివేటు స్కూళ్లు, విద్యాలయాల సంఖ్య పెరగడానికి పదకొండవ ప్రణాళిక కృషి చేస్తే పన్నెండవ ప్రణాళిక దానిని మరింత గట్టిగా సమర్థించి, సర్కారీ విద్యాలయాల పాలిట యమపాశంగా తయారయ్యింది.
ఈ మధ్యన పరిశీలనలోకి వచ్చిన ఎన్‌సిహెచ్‌ఇఆర్‌ బిల్లు ప్రకారం యుజిసి, ఎఐసిటిఇ, బార్‌ కౌన్సిల్‌లను రద్దుచేసి ఒకే ఏకీకృత సంస్థ ఆధీనంలోకి పరిశోధనల స్కాలర్‌షిప్‌లను తెచ్చే ప్రయత్నం జరుగుతున్నది. ఈ విధంగా జరిగితే అధికార దుర్వినియోగం, అవినీతి జరిగే అవకాశాలు ఎక్కువ అవుతాయి.
కనుక విద్యారంగ ప్రయివేటీకరణను, కేంద్రీకరణను వ్యతిరేకించడం మన ప్రధాన కర్తవ్యంగా పోరాటం సాగిద్దాం.
విద్యాలయాల్లో విద్యార్థుల ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ :
విద్యార్థులను సమాజంతో అనుసంధించే వాటిలో విద్యార్థి రాజకీయాలు ప్రధానమైనవి. కాని, మన దేశంలో చాలా విద్యాలయాల్లో ఇవి నిషిద్ధం. మన దేశంలో వున్న కళాశాలలను ఈ క్రింది విధంగా విభజించవచ్చు.
1. విద్యార్థి సంఘాలను, ఎన్నికలనూ రెండింటినీ నిషేధించిన కళాశాలలు.
2. విద్యార్థి సంఘాలను కాకుండా కేవలం ఎన్నికలను మాత్రమే నిషేధించిన కళాశాలలు.
3. విద్యార్థి సంఘాలను నిషేధించి ప్రత్యక్ష లేక పరోక్షంగా విద్యార్థి యూనియన్‌ ఎన్నికలను అనుమతించే కళాశాలలు.
4. విద్యార్థి సంఘాలు స్వేచ్ఛగా పనిచేస్తూ, యూనియన్‌ ఎన్నికలుకూడా జరిగే కళాశాలలు.
విద్యార్థుల రాజకీయాలు ఎన్నో మార్లు చర్చల్లో నిలిచాయి. బిర్లా - అంబాని రిపోర్టు (2000) , ఎన్‌డిఎ ప్రభుత్వ హయాంలో వచ్చిన మోడల్‌ యాక్ట్‌ విద్యార్థుల ప్రజాస్వామ్య హక్కును అణిచివేయాలని చాలా ప్రయత్నించాయి. దీనికి కారణం విద్య ప్రయివేటీకరణకు ఈ సంఘాలు వీలు కల్పించకపోవడమే. లింగ్డో కమిటీ 2006 మే 23న ఇచ్చిన రిపోర్టులో విద్యార్థి ఎన్నికలను సమర్థిస్తూ అవి ఉండవలసిన అవసరాన్ని కూలంకషంగా చెప్పింది. అంతేకాక విద్యార్థి సంఘాల ప్రాముఖ్యతను కూడా ఈ కమిటీ వివరించింది. ఎంహెచ్‌ఆర్‌డి ఏర్పరిచిన ఈ కమిటీ రిపోర్టులను, సూచనలను పాటించడానికి కేంద్రం ఏ విధమైన చర్యలు తీసుకోకపోవడం, ఈ కమిటీ సిఫార్సులను పాటించని కళాశాలలపై న్యాయపరమైన చర్యలను తీసుకొనే అంశాన్ని పరిశీలించకపోవడం అనుమానాలకు తావిస్తున్నాయి.
విద్యార్థి ఎన్నికలలో ధనం, బలం అంశాల జోక్యాన్ని కాదనలేం. కాని లింగ్డో కమిటీ ఎన్నికల బరిలోకి దిగే అభ్యర్థి అర్హతలను సూచించిన విధానం వివాదాస్పదంగా మారింది. ఈ సూచనలను పాటించలేదన్న నెపంతో 2008 నుంచి జెఎన్‌యు విద్యార్థి ఎన్నికలను నిలిపివేయడం, సుప్రీంకోర్టులో ఈ కేసుపై జరిగిన వాగ్వివాదాలు లింగ్డో కమిటీ సార్థకతపైనే ప్రశ్నలు రేపుతున్నాయి.
ఉత్తరప్రదేశ్‌లో ప్రధాన రాజకీయ పార్టీలు విద్యార్థుల ఎన్నికలను నిర్వహిస్తామని ఎన్నికల మ్యానిఫెస్టోలలో ప్రధానాంశంగా ఉంచి ఎన్నికలు గెలిచాక ఎన్నికలను పెట్టకుండా విద్యార్థులపై హింసకు తెగబడి వారి పోరాటాలను అణిచివేయడాన్ని స్పష్టంగా చూడవచ్చు.
అందువల్ల, పాలక వర్గాల లాభాపేక్షకు విద్యారంగం బలికాకుండా ఉండాలంటే లింగ్డో కమిటీ సూచించిన విధానంలో దేశంలోని అన్ని కళాశాలల ప్రాంగణాల్లో విద్యార్థుల ప్రజాస్వామ్య హక్కు అయిన రాజకీయ చైతన్యాన్ని కాపాడుకోవలసిన అవసరం ఎస్‌ఎఫ్‌ఐ సభ్యులమైన మన అందరిపై ఉంది. దీని కోసం మనం మన శాయశక్తులా, చివరి ఊపిరి వరకు పోరాడి మన హక్కులను మనం పొందే వరకు ఈ పోరాటాన్ని సాగిద్దాం!!

No comments:

Post a Comment